Afghanistan మహిళల ఉన్నత విద్యకు తాలిబన్లు గ్రీన్ సిగ్నల్.. కానీ...

4 months ago 9

| Samayam Telugu | Updated: Sep 13, 2021, 11:44 AM

మహిళలు కేవలం పిల్లల్ని మాత్రమే కని పెంచాలని, వారికి మంత్రి పదవులు చాలా భారమైనవంటూ తాలిబన్ల ఇటీవల చేసిన వ్యాఖ్యలు వారి సహజ నైజాన్ని బయటపెట్టాయి.

అఫ్గన్ మహిళల విద్య

ప్రధానాంశాలు:

ప్రత్యేకంగా మహిళల కోసం యూనివర్సిటీలు.కో ఎడ్యుకేషన్ ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని ప్రకటన.ముఖం కనిపించకుండా నకాబ్ తప్పనిసరి.
అఫ్గన్ తాలిబాన్ల తాత్కాలిక ప్రభుత్వం కొత్త విద్యావిధానాన్ని ప్రకటించింది. గత ఏలుబడిలో బాలికలు 5వ తరగతి వరకే చదవాలని, ఆపై చదువులపై నిషేధం విధించిన తాలిబన్లు.. ప్రస్తుతం ఆ నిబంధనను సడలించారు. మహిళలు ఉన్నత విద్యను అభ్యసించవచ్చని ఆపద్ధర్మ ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్‌ బాఖీ హక్కానీ ప్రకటించారు. అయితే.. మహిళలకు ప్రత్యేక ఉన్నత విద్యా సంస్థలు ఉండాలని అన్నారు. ఒకవేళ అలా కుదరకపోతే మహిళలకు వేర్వేరు తరగతులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

సిలబ్‌సను కూడా సమీక్షించి, మార్పులు చేర్పులు చేయనున్నట్టు తెలిపారు. బాలికలు, మహిళలకు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ ఉంటుందని, ముఖం కప్పుకొనేలా నకాబ్‌, హిజాబ్‌ తప్పనిసరి అని వెల్లడించారు. అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చదువుకోవడం ఇస్లాం సూత్రాలకు విరుద్దమని మంత్రి బాఖీ హక్కానీ పేర్కొన్నారు. ‘కో-ఎడ్యుకేషన్ ఇస్లాం సూత్రాలకు విరుద్ధమైంది.. అంతేకాదు ఇది జాతీయ విలువలతో విబేధిస్తుంది.. అలాగే, అఫ్గన్ల సంప్రదాయాలకు పూర్తి వ్యతిరేకం’ అని తెలిపారు.

మహిళలకు ప్రత్యేకంగా లేదా వేర్వేరుగా తరగతులు నిర్వహించడం లేదా లింగబేధం ఆధారంగా వర్గీకరించాలని ఆయన సూచించారు. కాబూల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలో తాలిబన్లకు మద్దతుగా సెప్టెంబరు 11న నిర్వహించిన ఓ కార్యక్రమానికి మహిళలు హాజరుకాగా.. వారికి కఠినమైన డ్రస్ కోడ్ అమలు చేశారు. అమ్మాయిలకు మహిళా ఉపాధ్యాయులే బోధించాలని తాలిబన్లు స్పష్టం చేశారు. ఒకవేళ అందుబాటులోకి లేకుంటే పురుషులను నియమించుకోవచ్చు.. కానీ, తాలిబన్ షరియాను అనుసరించాలి.

‘ఇస్లామిక్ వ్యవస్థను’ స్థాపించడానికి పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా చేసిన జిహాద్ ఫలితమే కొత్త నియమాలు అని హక్కానీ అన్నారు. అంతేకాదు, 20 ఏళ్ల వెనక్కు వెళ్లాలని కోవడం లేదని అన్నారు. తాలిబన్ల గత పాలనలో మహిళలు, బాలికలు పాఠశాలకు వెళ్లడానికి అనుమతించబడలేదు.. కానీ, ప్రస్తుతం ఉన్నదానిపై నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు.

కాగా.. తాలిబాన్ల భయంతో అఫ్గన్‌లోని సంగీతకారులు పాకిస్థాన్‌కు వలస వెళ్తున్నారు. ఇప్పటికే దిగ్గజ సంగీతకారులు పేషావర్‌ చేరుకున్నారు. కాగా, కాబూల్‌ విమానాశ్రయంలో 12 మంది మహిళా ఉద్యోగులు తిరిగి విధుల్లోకి చేరారు. వారంతా భద్రతా విభాగంలో పనిచేస్తున్నారు. దేశీయ విమాన సేవలు ప్రారంభమైన నేపథ్యంలో.. మహిళా ప్రయాణికులను వారు తనిఖీ చేస్తారు.

గత నెల కాబూల్‌ విమానాశ్రయం వద్ద ఐఎస్-కే ఆత్మాహుతి దాడుల తర్వాత అమెరికా డ్రోన్‌ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పేలుడు పదార్థాలతో ఓ కారులో వెళ్తున్న ఐఎస్-కే ఉగ్రవాదిని మట్టుబెట్టామని ప్రకటించింది. అయితే.. ఆ వ్యక్తి జెమారీ అహ్మదీ(43) అనే సాధారణ పౌరుడని, కాలిఫోర్నియాకు చెందిన ఓ సంస్థలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడని తేలింది.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : taliban announce new rules for women and girls education in afghanistan
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article